Monday, August 29, 2011

HIGHLY EMOTIONAL LETTER...!

This is the letter By PRAVEENA KOLLI.All the credit goes to her. I'm posting it because it touched my heart. Hats-off to the writer.

పోస్ట్ చెయ్యని ఉత్తరాలు : అమ్మ రాసిన ఉత్తరం: 

ప్రియాతి ప్రియమైన నా బంగారు తండ్రికి ,
ప్రేమతో దీవించి రాయునది మీ అమ్మ. ఎలా ఉన్నావురా కన్నా? వేళకు తిండి తింటున్నావా? కంటినిండా నిద్ర పోతున్నావా? నా కోడలు ఎలా ఉంది? మనమలు, మనవరాళ్ళు బాగా చదువుకుంటున్నారా?

రేపోమాపో ప్రశాంత నిద్రలోకి జారుకునే వయస్సు వచ్చేసింది నాకు. ఏ జాములో జారుకుంటానో నాకే తెలీదు. చివరిసారిగా నీకో ఉత్తరం రాయమని ,నిన్ను వీడలేని నా మనసు, నా మధికి రహస్యంగా చెప్పింది. మీ నాన్నకు కూడా తెలీకుండా రాస్తున్నా నీకీ ఉత్తరం.
ఈ ముసలి వయస్సులో వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవించిన జీవితమంతా నువ్వే కనిపిస్తున్నావు. కన్నీరు నిండిన కళ్ళలో మసకగా, కనుచూపుమేరా నువ్వే ఉన్నావు.

పెళ్ళంటే ఏమిటో తెలిసీ, తెలియని వయసులోనే నా మనువైపోయింది. జీవితం, సంసారం, బాధ్యతలు అనే పెద్ద పెద్ద పదాల అర్థం తెలియక ముందే నువ్వు నా జీవితంలోకి ప్రవేశించేశావు. స్నేహితులు, షికారులు, సినిమాలు, చదువులు అంటూ నువ్వు కొంటెగా తిరిగే నీ వయస్సులోనే నేను నీకు తల్లినయ్యాను. పరిపక్వత ఇంకా పరుచుకోని వయసులోనే నీ చిన్ని ప్రాణం నా చేతుల్లో పరుచుకుంది.

ఎక్కడ నుంచీ వచ్చిందో నాకా శక్తి, ఏ దేవుడు ప్రసాదించాడో నాకా యుక్తి, ఉపాయం. నీ పాల బుగ్గల్లోని పసితనం నాకు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది. నీ కళ్ళల్లో స్వచ్ఛత నాకు అమ్మతనాన్ని ప్రసాదించేసింది. నీకెలా లాల పోసానో, నీకెలా జోల పాడానో, నీకెలా భువ్వ తినిపించానో……ఏమో నాకే తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే “నేను నీకు అమ్మను, నువ్వు నాకు బిడ్డవు”.

“అమ్మ, నాకూ బొత్తాలు పెట్టుకోవటం వచ్చు. నేనే షు లేసులు కట్టుకుంటాను. నేనే చేసుకుంటాను..నాకు వచ్చు”, అంటూ నువ్వు చిన్నతనాన పెద్దరికాన్ని చూపిస్తుంటే, నేను మురిసిపోయాను. నా కొడుకు ఎంత పెద్దవాడైపోయాడా అని ఆశ్చర్యపోయాను.
నువ్వు నిజంగా పెద్దవాడివైన తర్వాత, “అమ్మ నువ్వురుకో, నీకేమి తెలీదు”, అంటూ నువ్వు నన్ను విసుక్కున్నప్పుడు మాత్రం చిన్నబుచ్చుకున్నాను.

నీకు గుర్తుందా కన్నా? నీ చిన్నతనంలో అందరూ నిన్ను “అమ్మ కూచి” అంటూ ఏడిపించేవారు. నా కొంగుకు వేలాడుతూనే ఉండేవాడివి. నా కాళ్ళకు అడ్డం పడుతూ తిరిగేవాడివి. నన్ను పనులు చేసుకోనీకుండా అల్లరి చేసేవాడివి.

ఇప్పుడు ఎంతో ఎదిగిన నిన్ను కంటినిండా చూసుకోవాలని, నోరారా పిలవాలని, నీకు వండి పెట్టాలని, కొసరి కొసరి తినిపించాలని చాన్నాళ్ళ నుంచీ ఎదురు చూస్తున్నాను. అయ్యో, నీకు తిరికేలేదే.

నువ్వు చదువుకుంటున్నప్పుడు సెలవలకు ఇంటికి వస్తే, నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాలని తాపత్రయ పడేదాన్ని. నువ్వుండే ఆ వారం రోజుల్లోనే చాదస్తంగా ఎన్నో పిండి వంటలు వండేదాన్ని. మీ నాన్న వారిస్తున్నా వినకుండా నిన్ను తినమని బలవంత పెట్టేదాన్ని. “అమ్మ నేను లావైపోతున్న, డైటింగ్ చేస్తున్నా, ఇవన్నీ తినమని బలవంత పెట్టకు”, అని నువ్వు కసురుకున్నప్పుడు నా కళ్ళలో తిరిగిన నీళ్ళు నీ కంట పడకుండా జాగ్రత్త పడేదాన్ని.

ఉద్యోగరీత్యా నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు నేను తల్లడిల్లిపోయాను. దేశం కానీ దేశంలో నువ్వెలా ఉంటావో, ఏమి తింటావో..కలవర పడిపోయాను. నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నావు. నీ ధైర్యాన్ని చూసి నేను నా ఆందోళనలను నీదాకా రానివ్వలేదు. నీ ఎదుగుదల ముందు నా ప్రేమ చాలా చిన్నగా కనిపించింది. కానీ, మనసులో ఏ మూలో నువ్వు నాకు దూరమయి పోతున్నావని మాత్రం అనిపించింది.

పెళ్లికొడుకులా నువ్వు పెళ్లిమండపంలో కూర్చున్న క్షణాన మొట్టమొదటి సారి గ్రహించాను, నువ్వు నిజంగా పెద్దవాడివయ్యావని. కానీ ఏమి ఉపయోగం మరు క్షణమే మర్చిపోయాను. నువ్వు ఎప్పటికి పసివాడివే నా మనసుకు.
నువ్వు నీ బిడ్డను ఎత్తుకుని ఇంటికి వచ్చిన వేళ నాకెంతో ఆశ్చర్యం. నా చిన్ని తండ్రి అప్పుడే ఒక బిడ్డకు తండ్రి అయ్యాడా?? ఎంతో అబ్బురం..ఆనందం.. ఆశ్చర్యం..

మీ నాన్న మనవడి పుట్టిన రోజున కొంత మొత్తం బహుమతిగా నీ చేతికిస్తే, “ఈ చిన్న మొత్తం నాకెంత నాన్న, మీరే ఉంచండి”, అని నువ్వు తిరిగి మీ నాన్న చేతిలో పెట్టిన క్షణాన, నా కనిపించింది “ఈ చిన్న సంఖ్య మాకెంతో పెద్ద సంఖ్య. మా జీవితమంతా కష్టపడి పొదుపు చేసిన పెద్ద మొత్తం”. ఎంతలో ఎంత మారిపోయాయి రోజులు!

నాకే కష్ట మొచ్చినా గబుక్కున చెప్పుకోలేనంత దూరంలో ఉన్నావు. రక్తపోటు పెరిగినా, మోకాళ్ళ నొప్పులు బాధించినా నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. చెప్పుకుంటే తగ్గే నొప్పులు కావు. అయినా ఎందుకో అలా అనిపిస్తుంది. కానీ, నీకేమి చెప్పలేను, నువ్వెక్కడ కంగారు పడతావో అని.
ఈ ముసలి వయసులో పనేమీ లేక, చెయ్యలేక ఎప్పుడూ నీ తలంపులే. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండే నెల రోజుల కోసం, నేను సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాను. అదేమిటో నువ్వుండే ఆ నెలరోజులు చిటుక్కున అయిపోతాయి. దేవుడి మొక్కులని, గుళ్లని, చుట్టాలని, స్నేహితులని..నిన్ను కళ్లారా చూసినట్టే ఉండదు, నోరార మాట్లాడినట్టే ఉండదు.

అప్పుడెప్పుడో నీదగ్గరకు వచ్చి ఉన్న కొద్ది రోజుల్లోనే నీ జీవితం ఎంత వేగంగా ఉందో అర్థంమయింది. క్షణం కుడా విశ్రమించలేని నీ బతుకు పోరాటంలో, అరక్షణమన్నా వృదా చెయ్యలేని నీ జీవిత గమనంలో, నాకోసం నువ్వు అరసేకనన్నా ఆగాలన్నా ఆగలేని ఆశక్తుడవని గ్రహించుకున్నాను. నువ్వెంత అలసిపోతున్నావో…నా మనసు తల్లడిల్లిపోతుంది. నీకు నా దగ్గర సేదతీరే తీరికే లేదే??!!

నా ఒడిలో నుంచి ఎప్పుడూ జారుకున్నావో , ఎలా పాకావో, ఎప్పుడు నడకలు నేర్చావో..ఏమో…ఇప్పుడు అంతు లేని నీ పరుగులు చూస్తుంటే, అలసిన నీ మనసును మళ్లీ నా బుజానికి ఎత్తుకోవాలనిపిస్తుంది. నీకు లాల పోసి, జోల పాడి నిద్ర పుచ్చాలనిపిస్తుంది.
నేను దేవుడ్ని కలిసిన మరుక్షణమే నీ గురించి అడిగేస్తా. ఆ భగవంతుడ్ని నిలదీసేస్తా, మనిషికి ఎందుకంత మేధస్సు ఇచ్చావు?. మేధస్సుతో పరుగులు పెట్టించి యంత్రికతకు దగ్గరగా ఎందుకు తీసుకెళ్ళావు?.

దేవుడితో పోట్లాడి, వాదించి, ఒప్పించి వరమడిగేస్తా, మరు జన్మలోను నీకు అమ్మగానే పుట్టాలని, జన్మంతా నువ్వు నా దగ్గరే ఉండాలని.
ఈ ఉత్తరం నువ్వు చదివితే, నీ మనసెంత బాధ పడుతుందో నాకు తెలుసు. నా అమ్మ మనసు, నీ మనసు గాయపరచటానికి ఎన్నడూ ఒప్పుకోదు. అందుకే, ఈ ఉత్తరం పైన నీ చిరునామా రాయకుండా పోస్ట్ చేస్తున్నా.

ఇట్లు,
మీ అమ్మ.
( It's all about generation gap, communication gap, speed of the life….)
this is old post in my blog..మరికొద్ది మంది చదువుతారని, మరికొద్ది మందికి ఆ తల్లి హ్రదయం అర్థం అవుతుందని ఆశ...

1 comment: